: సైన్స్-టెక్నాలజీ రంగంలో మరింత పెట్టుబడి అవసరం: ప్రధాని
భారత్ లో శాస్త్ర సాంకేతిక రంగం (సైన్స్-టెక్నాలజీ)పై వార్షిక వ్యయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. సోమవారం జమ్మూలో 101వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. సైన్స్-టెక్నాలజీలో వార్షిక వ్యయాన్ని స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో కనీసం 2 శాతం పెంచాలని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంతో కలసి పరిశ్రమ ఇందుకు చొరవ చూపాలని ఆయన చెప్పారు. దక్షిణ కొరియా లాంటి దేశాలలో జీడీపీలో అధిక శాతం సైన్స్-టెక్నాలజీకి వెళుతుందని, కొరియాలో పరిశ్రమలు అందజేస్తున్న సహకారం కూడా అపూర్వమైనదని ఆయన తెలిపారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం అనుకొన్న లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వంతో చేతులు కలపాల్సిందిగా దేశ కార్పొరేట్ రంగానికి మన్మోహన్ పిలుపునిచ్చారు.