: చదువు, సంస్కారం ఉన్నవాళ్లు చేసే వ్యాఖ్యలేనా?: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన వెంకయ్యనాయుడు


రాష్ట్ర కాంగ్రెస్ నేతల తిట్లు, శాపనార్థాలు.. చదువు సంస్కారం ఉన్నవాళ్లు చేసే పనేనా? అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. హైదరాబాద్ లోని కొంపల్లిలో ఆయన మాట్లాడుతూ, ఒకే పార్టీ నేతలు బజారున పడి తిట్టుకుని ప్రజల్లో విద్వేషాలు రేకిత్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని ప్రతిపాదిస్తే, ఆ పార్టీ యువరాజు దానిని తప్పుపడతారు, ఇదెక్కడి సంస్కృతి? అని ఆయన నిలదీశారు.

బీజేపీ ఇచ్చిన మాట తప్పదని పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో అపోహలకు తావు లేకుండా పరిపక్వత ప్రదర్శించాలని ఆయన అన్నారు. విభజన కాంగ్రెస్ చేస్తే సరే, లేకపోతే తాము అధికారంలోకి రాగానే చేస్తామని ఆయన తెలిపారు. ముందుగా సీమాంధ్రలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

సీడబ్ల్యూసీ తీర్మానం అంటే పార్టీ తీర్మానమని, దానిని మంత్రులు, ముఖ్యమంత్రులు విమర్శించకూడదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతలు స్కూలులో చదువుతున్నప్పుడే, తాము కాలేజీలో ఉన్నామన్న విషయాన్ని గుర్తించాలని దెప్పిపొడిచారాయన. కాంగ్రెస్ పార్టీకి దళితులు, మైనార్టీలు సహా అన్ని వర్గాలు దూరమవుతున్నాయని తాజా ఎన్నికల్లో నిరూపితమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతోందని ఎద్దేవా చేశారు. మోడీని దేశ రక్షకుడిగా అభివర్ణించిన వెంకయ్యనాయుడు, ఆయనొక్కరే అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలరని అన్నారు.

బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు వస్తారా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. నువ్వు వెళ్లి వారింటి తలుపు తడితే, వాళ్లు నీ భుజం తడతారని ఆయన సూచించారు. ఎమర్జెన్సీ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీపై ఇంత వ్యతిరేకత చూడలేదని ఆయన తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి, కమిటీలతో కాలయాపన చేసి, ఆ కమిటీల నివేదికలు చెత్తబుట్టలో పడేసిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల ముందు నాటకాలాడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News