: మనోళ్లు మాంసాహారాన్ని బాగా లాగించేస్తున్నారట!


రాష్ట్రంలో మాంసాహారాన్ని మహా ప్రీతిగా తినేవారి సంఖ్య పెరిగిపోతోంది. అవును, ఈ విషయం రాష్ట్రం ఎగుమతి లెక్కలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మాంసం 2011-12 నాటికి 8.24 లక్షల టన్నులు ఉండగా, 2012-13లో 9.30 లక్షల టన్నులకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14)లో 10 లక్షల టన్నులకు పైగానే మాంసం ఉత్పత్తి అవుతోందని అంచనా. ఇది దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం మాంసంలో ఐదో వంతు. మన రాష్ట్రంలో కోళ్లు, మేకలు, గొర్రెలు, గిత్తలు, దున్నల పెంపకం పెరిగింది. ఫలితంగా శరవేగంగా మాంసం ఉత్పత్తి పెరిగింది. కానీ, ఎగుమతులు తగ్గిపోవడంతో దేశ ఆర్థిక పురోగతిపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు.

మూడేళ్ల క్రితం వరకు మాంసం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉంది. మరి, ఉత్పత్తి అయిన మాంసం ఎటు పోతుందోనని ఆరా తీస్తే.. ఇక్కడ వినియోగం పెరిగిన విషయం బయటపడింది. ఆధునిక సంప్రదాయ పోకడలు, విదేశీ సంస్కృతిని అనుకరించడంతో నగరాలు, పట్టణవాసుల ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మాంసం వినియోగం రాష్ట్రంలో భారీగా పెరిగి, ఉత్పత్తయ్యే మాంసం ఎక్కువ శాతం రాష్ట్రంలోనే వినియోగమైపోతోంది. హైదరాబాదుతో పాటు ప్రధాన నగరాల్లో మాత్రం చేపల వినియోగం తగ్గింది. కానీ, కోడి, మేక మాంసం వినియోగం పెరిగింది. చేపల వంటకానికి ఎక్కువ సమయం పడుతుండటంతో, నగర వాసులు చేపలను తినటం తగ్గించేశారని తెలిసింది. అయితే, నగరవాసుల్లో అధిక శాతం వయసు మీరిన వారు మాత్రం శాకాహారులుగా మారారని కూడా ఈ లెక్కల్లో తేలింది.

  • Loading...

More Telugu News