: తిరుపతి, తిరుచానూరు వాసులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
తిరుపతి వాసులకు శుభవార్త.. ఇకపై నెలలో ఓ మంగళవారం తిరుపతి, తిరుచానూరు, తిరుమల వాసులకు శ్రీ వేంకటేశ్వరుని ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. దీన్ని ఫిబ్రవరి 4వ తేదీ (మంగళవారం) నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. శ్రీవారి దర్శనంలో తమకూ ప్రత్యేక కోటా కల్పించాలని మూడు దశాబ్దాలుగా స్థానికులు కోరుతున్న విషయం తెలిసిందే. దీనికి ఆరు నెలల క్రితం టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. నెలలో ఒకసారి అయిదు వేల మందికి ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించాలని టీటీడీ తీర్మానించింది.
ముందుగా తిరుమల, తిరుపతి, తిరుచానూరు వాసులకు ప్రయోగాత్మకంగా టికెట్లు కేటాయించి పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ మొదటి దశలో వెయ్యి మంది స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం ఆదివారం నాడు, ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర, కంప్యూటర్ ఫోటో సేకరించి దర్శనం టిక్కెట్లు ఇస్తారు. తిరుపతి వాసులు తమ ఆధార్ గుర్తింపు కార్డును కౌంటర్ వద్ద చూపించాల్సి ఉంటుంది. టిక్కెట్లు పొందిన స్థానికులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూలో అనుమతిస్తారు. దీనిపై టీటీడీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాక.. స్థానికుల కోటాను అయిదు వేలకు పెంచనున్నారు.