: రాజకీయాల్లోకి వచ్చేందుకు రాజీనామా చేసిన ముంబయి పోలీసు కమిషనర్
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రభుత్వాధికారులు కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ నిన్న (గురువారం) రాజీనామా చేశారు. వెంటనే రాజీనామా లేఖను మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ కు సమర్పించారు.
రాజీనామా విషయం నిజమేనన్న సత్యపాల్.. జాతికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే, తన భవిష్యత్తు ప్రణాళికలేంటో మాత్రం చెప్పలేదు. 2015లో రిటైర్ కావలసిన ఆయన ముంబయి పోలీస్ కమిషనర్ పదవినుంచి తానుగా తప్పుకున్న తొలి వ్యక్తి కావడం గమనార్హం. ఇదిలావుంటే, కొద్ది రోజుల్లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను ఆయన కలిశారని తెలుస్తోంది.