: మోడీతో మీటింగా ... అబ్బే... లేదే!: శరద్ పవార్
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో తాను సమావేశమయ్యానంటూ వస్తున్న వార్తలను అబద్ధాలుగా కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొట్టి పారేశారు. అలాంటిదేమీ జరగలేదన్నారు. 'జనవరి 17న నేను మోడీతో భేటీ అయ్యానంటూ ఒక పత్రికలో వచ్చిన వార్త సత్యదూరం, ఆధారరహితం. నేను రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రులను కలుస్తుంటా. ముఖ్యమంత్రుల సదస్సులోనూ ఇలానే జరుగుతుంది. కానీ, గత ఏడాది కాలంలో మోడీతో భేటీ అవలేదు' అని పవార్ ట్విట్టర్లో తెలిపారు. ఎన్నికల అనంతరం బీజేపీతో చేయి కలిపేందుకు పవార్ ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా 2002నాటి అల్లర్ల విషయమై మోడీ గురించి మాట్లాడకుండా వదిలేయడం మంచిదని ఎన్సీపీకే చెందిన ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించడంతో విశ్లేషకుల ఊహలకు రెక్కలు తొడిగాయి.