: విభజన ఆగేది కాదు..ఆపగలిగే వారు లేరు: దామోదర
రాష్ట్ర విభజన ఆగేది కాదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకు వెళ్లిపోయిందని, ఇప్పుడు దానిని ఆపగలిగేవారు ఎవరూ లేరని అన్నారు. ఆర్టికల్-3 ప్రకారమే విభజన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి చరిత్ర తెలియాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణ ఇండియన్ యూనియన్ లో భాగమని అన్నారు. తెలంగాణకు స్వయం ప్రతిపత్తి ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారని... అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి నాయకుడిగా వ్యవహరించాలని... అయితే ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి తన మూలాలను మర్చిపోకూడదని ఆయన సూచించారు. విలువలకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.