: పైలట్ కావాలనే దొంగతనానికి పాల్పడ్డాడు.. భయపడి లొంగిపోయాడు: అనురాగ్ శర్మ
గుంటూరు జిల్లా ఈపురంకు చెందిన కిరణ్ అతని సోదరుడు ఆనంద్ తో కలసి దొంగతనానికి పాల్పడ్డాడని జంటనగరాల కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాద్ లో సంచలనం రేపిన తనిష్క్ బంగారు నగల దుకాణం చోరీ కేసులో లొంగిపోయిన కిరణ్ కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్లంబింగ్ పనులు చేసే కిరణ్, ఆనంద్ లు భవిష్యత్ మీద ఆశలతో దొంగతనానికి పాల్పడ్డారు. పైలట్ అవుదామనుకున్న కిరణ్ అందుకు భారీ మొత్తం అవసరం కావడంతో 15 లక్షల రూపాయలు దొంగతనం చేద్దామనుకున్నాడని పోలీసులు తెలిపారు.
అలాగే అతని సోదరుడు ఆనంద్ కు పోలియో ఉండడంతో దానికి వైద్యం చేయించుకునేందుకు 5 లక్షల రూపాయలు అవసరమని నిర్ణయించుకుని, తనిష్క్ నగల దుకాణం వెనుకనున్న గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. చేతికి గ్లౌజులు వేసుకుని, గుర్తు పట్టకుండా తలకు టోపీ పెట్టుకున్నారని తెలిపారు. అయితే దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వికలాంగుడని, షాపులోకి వస్తూనే సీసీ కెమేరాల లైట్లు ఆఫ్ చేశాడని, ఆ తరువాత కౌంటర్ల అద్దాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించాడని తెలిపారు.
వారిని గుర్తు పట్టకుండా ఉండేందుకు ఆ ప్రదేశంలో కారంపొడి చల్లారని ఆయన తెలిపారు. తెల్లవారుజామున షాపుకు వచ్చిన సిబ్బంది జరిగిన దొంగతనంపై ఫిర్యాదు చేశారని తెలిపారు. మొదట 18 కేజీల బంగారం, 12 కేజీల రాళ్లతో కూడిన బంగారం పోయిందన్న సిబ్బంది, తరువాత 19.20 కేజీల బంగారం దొంగతనానికి గురయ్యిందని తెలిపారన్నారు. అయితే చోరీకి గురైన బంగారం అంత కాదని, వాస్తవ బంగారంపై నిగ్గు తేల్చేందుకు లెక్కింపు ప్రారంభించామని ఆయన చెప్పారు. మీడియా ప్రసారం చేస్తున్న కథనాలు, పోలీసుల గాలింపు ఎక్కువైందని గమనించిన దొంగలు తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో తెలియక టీవీ ఛానెల్ ద్వారా పోలీసులకు లొంగిపోయారని అనురాగ్ శర్మ వెల్లడించారు.
కిరణ్ దగ్గర్నుంచి 5 కేజీలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నామని, అందులో 58 చెవి రింగులు, 98 ఉంగరాలు ఉన్నాయని తెలిపారు. తనిష్క్ చెబుతున్న బంగారానికి దొరికిన బంగారానికి పెద్దగా వ్యత్యాసం ఉందని తాము భావించడం లేదని ఆయన తెలిపారు. అయితే ఆనంద్ పరారీలో ఉండడంతో అతని వద్దనున్న బంగారం స్వాధీనం చేసుకుంటే పూర్తి అంచనా వస్తుందని అన్నారు. ఆనంద్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని, తొందర్లోనే అతనని పట్టుకుంటామని తెలిపారు. అయితే తనిష్క్ దుకాణంలో జరిగిన చోరీ 30 కేజీల బంగారంది కాదని, 5 కేజీలకు పైగా బంగారం చోరీకి గురయ్యిందని ఆయన స్పష్టం చేశారు. తనిష్క్ దుకాణంలో 2009లో మరమ్మతులు జరిగిన ప్రదేశంలో రంధ్రం చేసి దొంగతనానికి పాల్పడ్డారని చెప్పి, కిరణ్ ను మీడియా ముందు ప్రదర్శించారు.