: అద్భుతమైన ఆఫర్.. ఆమెను పెళ్లాడితే రూ.830 కోట్ల కానుక!
'పెళ్లి కాని ప్రసాదు'లకో అద్భుతమైన ఆఫర్! ఆ అమ్మాయిని పెళ్లాడితే.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 830 కోట్ల రూపాయలను కానుకగా ఇస్తారు. హాంగ్ కాంగ్ కు చెందిన ఓ బిలియనీర్ ఈ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. సెసిల్ చావో జి ట్సుంగ్ తన కుమార్తెకు వివాహం చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. తన కుమార్తెను పెళ్లి చేసుకునే వారికి సుమారు 400 కోట్ల రూపాయలు ఇస్తానని 2012 సెప్టెంబర్ లో జి ట్సుంగ్ ప్రకటించారు. తాజాగా, ఈ మొత్తాన్ని రెట్టింపు చేసారు.
తనకు కాబోయే అల్లుడు విలాసవంతమైన జీవితం గడిపేలా భారీ మొత్తంతో పాటు సకల సౌకర్యాలూ కల్పిస్తానని జి ట్సుంగ్ చెబుతున్నారు. అయితే.. ఇంకా పెళ్లి కొడుకు దొరక్కపోవడమేమిటి అనుకుంటున్నారా? అక్కడే చిక్కంతా వుంది, ఎందుకంటే.. ఈ పెళ్లి కూతురు స్వలింగ సంపర్కురాలు. గత తొమ్మిదేళ్ళుగా మరో అమ్మాయితో కలసి హాయిగా సహజీవనం చేస్తోంది. జి ట్సుంగ్ వ్యాపార బాధ్యతల్ని కూతురుకు అప్పగించాలని మొదట భావించారు. ఆమె వివాహం చేసుకోకపోతే, తన ఇద్దరు కుమారులకు ఇవ్వాలని ఇప్పుడు ఆలోచిస్తున్నారు.