: టీడీపీ కచ్చితంగా కాంగ్రెస్ తోకపార్టీనే : కేటీఆర్
కాంగ్రెస్ సర్కార్ మీద టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ వ్యతిరేకించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. పాదయాత్రలో రోజూ అధికార కాంగ్రెస్ పార్టీ మీద కారాలు మిరియాలు నూరుతున్న చంద్రబాబు, ప్రభుత్వాన్ని మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీడీపీ కచ్చితంగా కాంగ్రెస్ తోకపార్టీనే అని ఆయన విమర్శించారు.
తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వనని సిఎం అనడం ఆయన అహంకార పూరిత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ఉపఎన్నికలకు వెళ్లే ధైర్యం లేకే కిరణ్ కుమార్ రెడ్డి విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారన్నారు. టీ-కాంగ్రెస్ నేతలది చాయ్ బిస్కెట్ల సమావేశమే నని ఆయన ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన తెలంగాణ ఎయిడ్స్ కంట్రోలర్స్ యూనియన్ తొలి వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.