: పేదరికం నుంచి ప్రపంచాన్ని చుట్టే వరకు అక్కినేని
సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని తన జీవన ప్రయాణాన్ని ముగించడం అందరినీ శోకసంద్రంలో ముంచేసింది. దివంగత ఎన్టీఆర్ తర్వాత పరిశ్రమపై అంత ముద్రవేసిన మహానటుడు అక్కినేనే! ఆయన లేడన్న విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ తమ ఆత్మీయుడిని కోల్పోయినట్టే ఫీలవుతున్నారు. ఇంత మంది గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న అక్కినేని రాత్రికి రాత్రే ఈ స్థాయికి రాలేదు. ఎంతో కష్టం, శ్రమ అతని విజయంలో కీలకపాత్ర పోషించాయి.
తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయికి ఎదగడానికి అక్కినేని చేసిన కృషి అమోఘం. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమలో అన్ని రంగాల్లో ఆయన పాత్ర నభూతో నభవిష్యతి అంటే అతిశయోక్తి కాదు. అక్కినేని నాగేశ్వరరావు 1924 సెప్టెంబర్ 20న బ్రిటీష్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీలోని కృష్ణా జిల్లా రామాపురంలో వెంకటరత్నం, పూర్ణమ్మ దంపతులకు జన్మించారు. వీరిదొక పేద వ్యవసాయ కుటుంబం. ఐదు మంది అన్నదమ్ముల్లో అక్కినేని చివరివారు. ఏనాడూ తన ఊరి పొలిమేరలను కూడా దాటలేడనుకున్న పేద వ్యక్తి... ప్రపంచాన్నే చుట్టే స్థాయికి ఎదుగుతాడని అక్కినేనే కాదు, ఎవరూ అనుకోలేదు.
పేద కుటుంబంలో పుట్టిన అక్కినేని స్టేజ్ ఆర్టిస్టుగా ప్రతిభను చాటి, టాప్ హీరోగా ఎదిగారు. ఆయన కెరీర్ ప్రారంభంలో ఆడ వేషాలు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎందుకంటే ఆ రోజుల్లో నాటికల్లో నటించడానికి మహిళలు ముందుకు వచ్చేవారు కాదు... దీంతో అందమైన ముఖారవిందం కలిగి ఉన్న అక్కినేని చేత ఆడ పాత్రలు వేయించేవారు. ఆ పాత్రల్లో ఆడవారికి సైతం కన్ను కుట్టేలా ఆయన పాత్రలో రాణించేవారు.
ఆయన సినీరంగ ప్రవేశం కూడా ఊహించని విధంగానే జరిగింది. ప్రముఖ నిర్మాత ఘంటశాల బలరామయ్య ఆయనకు సినిమాలలో అవకాశం ఇచ్చారు. 17 ఏళ్ల వయసులో 1941లో 'ధర్మపత్ని' సినిమాలో ఆయన మొదటిసారి నటించారు. తర్వాత రెండో సినిమా 'సీతారామ జననం'లో ఆయన రాముడి పాత్రలో లీడ్ రోల్ పోషించారు. అక్కడ మొదలైన ఆయన సినీ ప్రస్థానం... ఆయన చివరి క్షణాల వరకు నిరంతరాయంగా 75 ఏళ్లపాటు కొనసాగింది. తన సినీ ప్రస్థానంలో 255 సినిమాలలో అక్కినేని నటించారు. బహుశా ఇన్నేళ్లు సినిమాలలో నటించిన వ్యక్తి ప్రపంచలోనే మరొకరు ఉండకపోవచ్చు. అక్కినేని తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు. ఆయన నటించిన సినిమాలో ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్లే.
అక్కినేని అనేక విలక్షణమైన పాత్రల్లో నటించారు. దేవుడు, రాజు, మంత్రి, తాగుడుకి బానిస, ప్రేమికుడు, తండ్రి, స్నేహితుడు ఇలా ఒకటేమిటి... నటించడానికి అవకాశం ఉన్న ప్రతి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఆయన నటించిన సినిమాల్లో మాయాబజార్, చెంచు లక్ష్మి, రోజులు మారాయి, నమ్మిన బంటు, మిస్సమ్మ, అనార్కలి, లైలా మజ్ను, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, ప్రేమనగర్, బాటసారి... ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో ఆణిముత్యాలున్నాయి. ఆయన నటించిన ప్రేమాభిషేకం టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఓ చెరగని రికార్డును నమోదు చేసింది. అది ఏమిటంటే, హైదరాబాదులో ఈ సినిమా ఏకంగా 533 రోజులు ఆడింది.
తెలుగు సినిమాలో మొట్టమొదటి సారిగా డబుల్ రోల్ (రెండు పాత్రలు) పోషించింది అక్కినేనే. మరో విషయం ఏమిటంటే, 'నవరాత్రి' చిత్రంలో ఆయన ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు. అక్కినేని నటించిన దేవదాసు సినిమా మన దేశంలో అనేక భాషల్లో నిర్మించారు. దేవదాసు పాత్రను అనేక మంది గొప్ప నటులు పోషించారు. కానీ, "మన దేశంలో ఒకే ఒక దేవదాసు ఉన్నారు. ఆయన అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే" అని ప్రముఖ నటుడు దిలీప్ కుమారే కితాబిచ్చారంటే ఆయన నటనాకౌశలం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. సినీ రంగంలోకి అడుగుపెట్టిన 50 ఏళ్లకు ఆయన నటించిన సీతారామయ్యగారి మనవరాలు మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.
సినీ రంగానికి ఎనలేని సేవ చేసిన అక్కినేనిని పలు పురస్కారాలు వరించాయి. భారత అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో భారత ప్రభుత్వం అక్కినేనిని గౌరవించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆయన్ను గౌరవించారు. నాలుగు సార్లు ఫిలింఫేర్ (1968-సుడిగుండాలు, 1973-మరుపురాని మనిషి, సీతారామయ్యగారి మనవరాలు-1991, బంగారు కుటుంబం-1994) అవార్డులను అక్కినేని సొంతం చేసుకున్నారు. 1989లో రఘుపతి వెంకయ్య అవార్డుతో ఆయన్ను సత్కరించారు. 1996లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుతో గౌరవించారు. మేఘసందేశం (1982), బంగారు కుటుంబం (1994) చిత్రాలకు గాను ఆయనకు నంది అవార్డులు దక్కాయి. అలాగే తమిళనాడుకు చెందిన 'కళైమామణి', మధ్యప్రదేశ్ కు చెందిన 'కాళిదాసు' అవార్డులతో అక్కినేనిని గౌరవించారు. అలాగే 'రాష్ట్ర ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్' సలహాదారుడిగా అక్కినేని సేవలందించారు. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుతో 'తానా' కూడా ఆయన్ను గౌరవించింది.
కేవలం ఇతర అవార్డులను పొందడమే కాదు, సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన వారిని సత్కరించేందుకు ఆయన స్వయంగా 'ఏఎన్నార్ నేషనల్ అవార్డు'లను నెలకొల్పారు. దేవ్ ఆనంద్, షబానా అజ్మి, అంజలీదేవి, లతామంగేష్కర్, శ్యాంబెనెగళ్, హేమమాలిని లాంటి ఉద్దండులు ఏఎన్నార్ అవార్డులను అందుకున్నారు.
సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన అక్కినేనిని పలు దేశాలు ఓ సాంస్కృతిక రాయబారిగా గుర్తించాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, మలేషియా, జపాన్ దేశాలు ఆయన్ను సాంస్కృతిక రాయబారిగా తమ దేశాలకు ఆహ్వానించాయి. భారతదేశం తరఫున అక్కినేని ఈ దేశాలన్నీ సందర్శించారు. ఇది చాలు అక్కినేనిని ప్రపంచ అగ్రదేశాలు ఎంతలా గుర్తించాయో చెప్పడానికి!