: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు ప్రయోగం విఫలమైంది: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు ప్రయోగం విఫలమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. ఆ ప్రయోగం విఫలత వల్లే విభజన బిల్లు శాసనసభ ముందుకు వచ్చిందని చెప్పారు. కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చారిత్రక అనివార్యత అని, ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. శాసనసభలో విభజన ముసాయిదా బిల్లుపై చర్చ నేపథ్యంలో కేటీఆర్ ప్రసంగిస్తున్నారు. బిల్లును తాను సగర్వంగా స్వాగతిస్తున్నానని ఈ సందర్భంగా చెప్పారు. మైనార్టీని మెజారిటీ శాసించకూడదని అంబేద్కర్ ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు.
అన్ని రకాల కమిటీలు, ఒప్పందాలు విఫలమైనందునే విభజన అన్న కేటీఆర్... ఏకపక్షంగా బిల్లు వచ్చిందన్నది అవాస్తవమన్నారు. అందరినీ సంప్రదించి, ఆమోదం పొందిన తర్వాతే సభకు బిల్లు వచ్చిందని తెలిపారు. అయితే, సీమాంధ్ర నేతల ఆందోళనలను, అనుమానాలను అర్థం చేసుకోవచ్చని చెప్పారు. శాంతియుత మార్గంలో, రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ ఏర్పాటు అని, 13 ఏళ్లలో గడపగడపకు, గుండెగుండెకు ఉద్యమం చేరిందని వివరించారు. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని 1954లో ఫజల్ అలీ కమిషన్ సిఫార్సు చేసిందన్నారు. చరిత్ర మాట్లాడేటప్పుడు అభిప్రాయాలు చెప్పకూడదని సూచించారు.