: మరణానికి ముందు అనూహ్య నరకం చూసింది!
అనూహ్య ఎస్తేర్ మరణానికి ముందు ముంబైలో అరాచకం జరిగింది. ఆ దారుణ ఘటన తాలూకు నిజాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనూహ్య జనవరి 5వ తేదీన ముంబై రైల్వేస్టేషన్ నుంచి హాస్టల్ కు వెళుతున్న సమయంలోనే అపహరణకు గురైనట్లు ముంబై దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులను ముంబై పోలీసులు విచారించడంతో.. వెన్నులో వణుకు పుట్టించే నిజాలు బయటపడ్డాయి.
ముంబయిలోని రెడ్ లైట్ ఏరియా కామాటిపురా సమీపంలోని ఒక గదిలో ఆమెను ఐదు రోజుల పాటు నిర్బంధించారు. ఆమెను దారుణంగా కొట్టారు, హింసించారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వివరాలను నిందితులు వెల్లడించారు. 23 ఏళ్ల అనూహ్య ఎల్ టిటి ఎక్స్ ప్రెస్ లో ఉదయం 4.45 గంటలకు లోక్ మాన్య తిలక్ టెర్మినస్ చేరుకుందని ముంబై పోలీసు వర్గాలు వెల్లడించారు. కొద్ది నిమిషాల తర్వాత తాను నివసించే అంధేరి వెస్ట్ కు వెళ్ళేందుకు ఒక క్యాబ్ మాట్లాడుకుంది. అయితే క్యాబ్ డ్రైవర్ అనూహ్యను దారి మళ్లించాడు. కొన్ని నిమిషాలు ప్రయాణించిన తర్వాత మరో ముగ్గురు వ్యక్తులు క్యాబ్ ఎక్కారు. అనూహ్య వారి దురుద్దేశ్యాన్ని పసిగట్టి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించిందని పోలీసు వర్గాలు తెలిపాయి. కానీ, నిందితులు ఆమె నుంచి మొబైల్ ఫోన్లు లాక్కొని వాటిని స్విచ్చాఫ్ చేశారు. ఆమెను కామాటిపురాకు సమీపంలోని ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఐదు రోజుల పాటు ఆమెను నిర్బంధించారు. ఎనిమిదో తేదీ రాత్రి లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిని ఆమె అడ్డుకోవడంతో నిందితులు అమెను దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు ఆమె మరుసటి రోజు వరకు స్పృహ కోల్పోయింది. అనంతరం వారు కంజూర్ మార్గ్ లోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అనూహ్యను హత్య చేశారు. ఆమెపై రసాయనాలు పోసి నిప్పు పెట్టారు అని ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కంజూర్ మార్గ్ సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ నిశికాంత్ విశ్వనాథ్ నుంచి తనకు ఒక మెయిల్ వచ్చిందని, అనూహ్యకు చెందిన కొన్ని వస్తువులు దొరికాయని ఆయన ఫోన్ చేసి చెప్పారని, కానీ వాటిని ఎక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నది మాత్రం చెప్పేందుకు ఆయన నిరాకరించారని అనూహ్య తండ్రి ప్రసాద్ మీడియాకు తెలిపారు. ముంబై పోలీసులు ఈ కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాము దర్యాప్తును తీవ్రతరం చేశామని, నిందితులను పట్టుకోవడానికి కొన్ని ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని ముంబై ఏసీపీ సునీల్ చెబుతున్నారు.