: 'అభివృద్ధి చెందాం... అయినా విడిపోదాం' అంటే బాగుండేది: పయ్యావుల
అభివృద్ధి చెందాం, అయినా విడిపోదాం అంటే బాగుండేదని..కానీ అలాంటి వాదన ఏదీ తెలంగాణలో జరగలేదని పయ్యావుల కేశవ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి, ఇతర ప్రాంతాలకు మధ్య ఉన్న తేడా ఏమీ లేదని శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా తెలిపిందని అన్నారు. హైదరాబాద్ పై ఎవరికివారు నచ్చినట్టు మాట్లాడారని గతంలో ఓ నేత నాలుకలు తెగ్గోస్తాం అంటే, మరో నేత హైదరాబాద్ మాది, సీమాంధ్రుల ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం అన్నారని గుర్తు చేశారు. మరొక అతను ఊర్లకు పోయినవారు తిరిగి రాకండి అంటూ అల్టిమేటం జారీ చేశారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాథి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? అని ఆయన సభను ప్రశ్నించారు. సువిశాల ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కేవలం హైదరాబాద్ లోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధితో ఉద్యోగావకాశాలు పెరిగాయని తెలిపారు. అలాంటి ఉద్యోగాల్లో ఎవరైనా వాటాలు అడిగారా? సామర్థ్యమున్నవారే ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన తరువాత మేము అభివృద్ధి చెందాము కాబట్టే విడిపోతామనడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.