: మేథావుల మౌనంతోనే ఈ విషమ పరిస్థితి: పయ్యావుల


సీమాంధ్ర ప్రాంత మేథావుల మౌనంతోనే నేడీ విషమ పరిస్థితి వచ్చిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఆయన ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. అసత్య ప్రచారంతో కూడిన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు వాస్తవాలను తెలియజేయడంలో సీమాంధ్ర ప్రాంత మేథావులు మౌనంగా ఉన్నందునే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందన్నారు. విభజనకు ఆత్మగౌరవమే ప్రాతిపదిక అయితే, తమ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం ఏమిటని ప్రశ్నించారు. ఒప్పందాలు అమలు జరగకపోవడమే విభజనకు ప్రాతిపదిక అయితే, శ్రీబాగ్ ఒప్పందం విషయంలో మోసపోయిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెనుకబడటమే విభజనకు ప్రాతిపదిక అయితే, తెలంగాణ కంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటన్నారు. వెనుకబాటు శ్రీకాకుళంలో ఉంది, చిత్తూరులోనూ ఉందని చెప్పారు.

ఒక్క పంటతోనే బతుకు పోరాటం సాగిస్తున్న ప్రాంతం రాయలసీమ అని చెప్పారు. పిల్లలు మినహా ఇంట్లో అందరూ వలసపోయే పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పారు. విభజన జరిగితే రాయలసీమ ఏడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారి తమ జిల్లాకు వచ్చి చూస్తే పరిస్థితేంటో తెలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నానని సభకు తెలిపారు. తుంగభద్ర నుంచి అనంతపురం జిల్లాకు రావాల్సిన 32 టీఎంసీల్లో 18 టీఎంసీలే వస్తోందన్నారు. 'సమాధులపై భవంతులు నిర్మించాలనుకుంటున్న ఈ బిల్లును ఆమోదించేది లేదు' అని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షింపబడతాయని భావిస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News