: అధికార, ప్రతిపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోం: మంద కృష్ణ మాదిగ
సార్వత్రిక ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలతో పొత్తులు పెట్టుకోమని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. హైదరాబాద్ లో ఎంఎస్పీ విధానపత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధానపరంగా భావసారూప్యమున్న బీఎస్పీ, వామపక్ష, ఆమ్ ఆద్మీ పార్టీలతో పనిచేసే అవకాశం ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రైస్తవ, అగ్రకుల పేదలు, వృద్ధులు, వికలాంగుల సమస్యలు విధానపత్రంలో పొందుపరిచామని ఆయన తెలిపారు. ముసాయిదాలో చేర్చిన సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన వాగ్థానాలను నెరవేర్చలేకపోయిందని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు. నియోజకవర్గాల వారిగా తమ పార్టీ ప్రచారం ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.