: తొలిటెస్టు.. తొలి సెంచరీ.. తొలి రికార్డు!


క్రికెట్ లో బ్యాట్స్ మన్ కు సెంచరీ అంటే తీపి గుర్తే. అదే తొలి టెస్టులో.. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధిస్తే.. అది ఓ రికార్డయితే.. ఆ బ్యాట్స్ మన్ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇప్పుడా సంతోషదాయక క్షణాలు భారత యువ ఓపెనర్ శిఖర్ ధావన్ కు అనుభవంలోకి వచ్చాయి.

సెహ్వాగ్ పై వేటు నేపథ్యంలో జట్టులోకి వచ్చిన ధావన్ అరంగేట్రం టెస్టులోనే అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాట్స్ మన్ గా రికార్డు పుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ధావన్ కేవలం 85 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి, ఆసీస్ బౌలింగ్ ను అపహాస్యం చేశాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీ, దాంతో పాటే కెరీర్లో తొలి రికార్డు.. ఏ ఆటగాడికైనా ఇంతకంటే మంచి ఆరంభం ఇంకేముంటుంది?

కాగా, ఓపెనర్ల వీరవిహారంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసింది. ధావన్ 111 పరుగులతో, విజయ్ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు 273/7 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన ఆసీస్, తొలి ఇన్నింగ్స్ ను 408 పరుగుల వద్ద ముగించింది. టెయిలెండర్ స్టార్క్ (99) సెంచరీకి పరుగు దూరంలో అవుటయ్యాడు. 

  • Loading...

More Telugu News