: తెలంగాణ ఏర్పాటు అనివార్యం: జేపీ
రాష్ట్రంలో అన్ని అంశాల్లోనూ విభజన స్పష్టంగా కనిపిస్తోందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) అన్నారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలు లేవు.. ప్రాంతాలు మాత్రమే మాట్లాడుకుంటున్నాయని విమర్శించారు. అన్ని వర్గాల్లో ప్రాంతీయ భేదం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇన్ని విభేదాల మధ్య కలసి ఉండడం అసాధ్యమని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష బలమైనదని, అందుకే లోక్ సత్తా పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందని జేపీ కుండ బద్దలు కొట్టారు.
గతాన్ని వదిలేసి యువత భవిష్యత్ గురించి ఆలోచించాలని, తాబట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటే కుదరదని జేపీ సూచించారు. ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. తెలుగు ప్రజల సమైక్యత వేరు అని.. గీతలు గీసినంత మాత్రాన బంధాలు తెగిపోవని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన.. దేశవిభజన జరిగినట్లు భావించాల్సిన అవసరం లేదని జేపీ అభిప్రాయపడ్డారు.