: ప్రియుడి కోసం నకిలీ పాస్ పోర్టుతో పాక్ వెళ్లిన ప్రియురాలు!
ప్రేమ ఎలాంటి పనైనా చేయిస్తుందనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. కానీ, ఈ ప్రేమ ముచ్చట వింటే మాత్రం షాక్ అవ్వక తప్పదు. గుజరాత్ కు చెందిన ఇరవై సంవత్సరాల నగిత రమేశ్ అనే యువతికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లో అజహర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ప్రేమ బంధం ఏర్పడ్డాక ఆ ప్రేమికులు కలుసుకోవాలని అనుకున్నారు. అంతే, ఇంకేముంది... వెంటనే ఆ అమ్మాయే అతడిని చూసేందుకు బయలుదేరింది.
ఇంతకీ ఆ యువకుడు ఎక్కడుంటాడో తెలుసా? పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ముల్తానీ సిటీలో. అయినా లెక్క చేయకుండా ప్రియురాలు వెళ్లింది. దోహా నుంచి లాహార్ విమానాశ్రయానికి నిన్న (గురువారం) చేరుకున్నప్పుడు అక్కడి అధికారులు ఎప్పటిలాగే తనిఖీలు చేశారు. అప్పుడే ఆ యువతి నకిలీ పాస్ పోర్టుతో ప్రయాణం చేస్తోందన్న విషయం బయటపడింది. దానిపై ఆమెను విచారించగా.. ఓ యువకుడిని తాను ప్రేమిస్తున్నానని, అందుకే అక్కడికి వచ్చాననీ, అతడి కోసం ఇస్లాం మతానికి కూడా మారాననీ చెప్పిందని ఇమ్మిగ్రేషన్ అధికారి వెల్లడించారు. అదే సమయంలో యువతిని తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చిన యువకుడిని కూడా విచారించినట్లు అధికారి చెప్పారు. మరి, ఈ ప్రేమకథ ఇకపై ఎలాంటి మలుపు తిరుగుతుందో!