: 'పెళ్లికాని ప్రసాదు'ల దేశంగా చైనా
చైనా ముందు పెను ముప్పు పొంచి ఉంది. అగ్రరాజ్యంతో సరితూగాలని పరుగులు తీస్తున్న చైనా పురుష ప్రపంచాన్ని ఓ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అక్కడి పురుషులు 40 ఏళ్లు దాటుతున్నా 'పెళ్లికాని ప్రసాదు'లుగానే మిగిలిపోతున్నారట. ఓ సర్వే వెల్లడించిన వివరాలు అక్కడి పురుష ప్రపంచం పెళ్లికోసం ఎంతగా ఆరాటపడుతున్నారో తెలియజేస్తున్నాయి. సాధారణ సంపాదన ఉన్న యువకుడికి పెళ్లి యోగం లేనట్టే లెక్క. అక్కడ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 10 వేల డాలర్లు కన్యాశుల్కంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
దీనికి కారణం అక్కడ అమల్లో ఉన్న ఒక బిడ్డే ముద్దు విధానం. దీని కారణంగా ఆ దేశంలో 3 కోట్ల మంది పురుషపుంగవులు తమకు పెళ్లి కాదేమో అనే భయంతోనే బతుకీడుస్తున్నారు. దీంతో అక్కడి యువత మోడల్స్ లా ఫోటోలకు ఫోజులిచ్చి, డీటెయిల్స్ తో పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ బోర్డులు ఏర్పాటు చేసి యాడ్స్ గా ప్రదర్శిస్తున్నారు. కనీసం వీటిని చూసైనా యువతులు తమను ఎంచుకోరా? అని ఆశపడుతున్నారు. ఇలా పెళ్లి కాకుండా మిగిలిపోయిన మగవారిని చైనాలో 'షెంగ్నాన్' లంటారు. వీరికి పోటీగా 'షెంగ్నిన్' అంటే పెళ్లి కాని ఆడవాళ్లు కూడా చైనాలో పెరిగిపోతున్నారట.
ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల పార్టీల సంస్కృతి పెరిగిపోతోంది. ఈ పార్టీల్లో ఏబీసీడీ గ్రేడుల అమ్మాయిలు, అబ్బాయిలు పాల్గొని తమతమ అర్హతలను ఏకరువుపెడతారు. వీరిలో డీ గ్రేడు అబ్బాయిలు పెళ్లికాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. వీరిని ఎవరూ ఎంచుకునేందుకు ముందుకు రావడంలేదు. దీంతో వీరు ఉత్తర కొరియా నుంచి వలస వస్తున్న అమ్మాయిలను 500 నుంచి 1500 డాలర్లు వెచ్చించి కొనుక్కుంటున్నారు. మరోవైపు పెళ్లికాని అమ్మాయిల జాబితాలో ఏ గ్రేడు అమ్మాయిలు చేరిపోతున్నారు. తమ స్థాయి కంటే ఎక్కువ స్థాయి ఉన్న అబ్బాయిలను వీరు కోరుకుంటుండడంతో పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు.