: నీళ్లంటే భయంతో.. అరవై ఏళ్ల పాటు స్నానమే చేయని పెద్దాయన!
ఆ పెద్దాయన వయస్సు ఎనభై ఏళ్లు. ఆయన అరవై ఏళ్ల పాటు స్నానమే చేయలేదు. దక్షిణ ఇరాన్ లోని డెజ్గా గ్రామానికి చెందిన అమో హాజీ ఊరవతల ఉన్న సమాధి ఆకారంలో ఉన్న ఓ గుంతలో నివసిస్తున్నాడు. చేతులు, కాళ్లు కడుక్కోవడం లాంటివేమీ అమో హాజీ చేయడు. జంతువుల మలాన్ని ఎండబెట్టుకుని పొగతాగుతాడు. కుళ్లిన ముళ్లపంది మాంసాన్ని ప్రీతిగా తింటాడు. నీళ్లతో శుభ్రం చేసుకుంటే రోగం వస్తుందేమోనన్న ఆయన భయమే దీనికి కారణమట.
అలాగని అమో హాజీని పిచ్చివాడని అనలేం. ఎందుకంటే.. ఆయన అందరినీ మామూలుగానే పలకరిస్తాడు. కార్ల అద్దాల ముందు నిల్చుని చక్కగా తల దువ్వుకుంటాడు. వెంట్రుకలు పొడవు పెరిగితే మంటల్లో కాల్చి సరిచేసుకొంటాడు. వినటానికి విచిత్రంగా ఉన్నా అతని దినచర్య ఇదే. అయితే, ఆయన ఇరవై ఏళ్ల వయస్సులో ఉండగా.. సమస్యలతో మానసికంగా కుంగిపోయి ఇలా మారిపోయాడని మాత్రం అక్కడి గ్రామస్తులు చెప్పారు. ఇంతకుముందు ఎక్కువ కాలం స్నానం చేయని రికార్డు.. కైలాష్ సింగ్ అనే భారతీయుడిది. కైలాష్ 38 ఏళ్ల పాటు స్నానమే చేయలేదు. ఇప్పుడీ హాజీ ఆ రికార్డును బద్దలుకొట్టేశాడు..!