: కాఫీ ... మీ వ్యక్తిత్వానికి 'కాపీ'!
పొద్దున్నే ఓ కప్పు కాఫీ పడితేనే కానీ చాలా మందికి చురుకుదనం రాదు.
అలాంటి వారికి దంతధావనం చేసీ చేయగానే వేడివేడి కాఫీ కప్పు చేతికి అందించాల్సిందే!
అయితే, ఈ కాఫీ తాగడంలో కూడా ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్ట్!
ఒకరికి చికోరీ బాగా కలిపిన ఫిల్టర్ కాఫీ ... మరొకరికి ఇన్ స్టంట్ కాఫీ... ఇంకొకరికి బ్లాక్ కాఫీ ... ఇలా ఎవరి అభిరుచి వారిది. అయితే, ఈ రుచులలోనే వారి అభిరుచులు కూడా దాగివున్నాయంటున్నారు పరిశోధకులు. ఆయా వ్యక్తులు తాగే కాఫీని బట్టి వారి వ్యక్తిత్వాన్ని విడమరచి చెబుతోంది వీటిపై అధ్యయనం చేసిన ఓ మహిళా క్లినికల్ సైకాలజిస్ట్. ఇందుకోసం వెయ్యిమంది కాఫీప్రియులను ఆమె నిశితంగా పరిశీలించింది.
ఇన్ స్టంట్ కాఫీ లాగించేవారు 'ఈజీ గోయింగ్' మనస్తత్వం గలవారట. ప్రతి విషయాన్నీ వీరు లైట్ తీసుకుంటారు. దేనికీ కంగారుపడిపోరట. ఇక బ్లాక్ కాఫీ (పాలు లేకుండా కాఫీ) తాగేవారిని నిరాడంబరులుగా ఆమె పేర్కొంటున్నారు. వీరిలో దాపరికాలు వుండవట. ఏ విషయాన్నైనా సరే మొహం మీదే చెప్పేస్తారు.
అలాగే, కోల్డ్ కాఫీ ఇష్టపడేవారు చాలా సాహసవంతులట. ప్రతి దానినీ చాలెంజ్ గా తీసుకుంటారు. కొన్ని సందర్భాలలో వీరు ట్రెండ్ సెట్టర్లుగా కూడా నిలుస్తారు. చూశారా ... కాఫీ అభిరుచి వెనుక వున్న విశేషాలు... మరి, మీరు కూడా కాఫీప్రియులైతే కనుక, ఏ కేటగిరీ కిందకు వస్తారో చూసుకోండి!