: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. రూ. 5కే షుగర్ స్ట్రిప్..
మధుమేహ వ్యాధితో బాధపడేవారు ఇంటి వద్ద నిత్యం వారి షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే, ఇదెంతో ఖరీదైన వ్యవహారం. దీనికి ఉపయోగించే గ్లూకో మీటర్ విలువ రూ. 2000 వరకు ఉంటుంది. అంతే కాకుండా షుగర్ స్ట్రిప్ ఒక్కొక్కటి రూ. 30కి పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. గ్లూకో మీటర్ ను రూ. 500 నుంచి 800 వరకు, ఒక్కో షుగర్ స్ట్రిప్ ను ఐదు రూపాయలకే కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వీటిని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్ నిన్న ఆవిష్కరించారు.
మధుమేహంపై భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగంగానే వీటిని అందుబాటులోకి తెచ్చినట్టు ఆజాద్ తెలిపారు. బిట్స్ హైదరాబాద్, ఐఐటీ ఖరగ్ పూర్, సీఎంసీ వెల్లూర్ తదితర సంస్థల సాయంతో వీటిని అభివృద్ధి చేశారు. మన దేశంలో ప్రస్తుతం ఆరున్నర కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. చైనా తర్వాత ప్రపంచంలో అత్యధిక షుగర్ పేషంట్లు ఇండియాలోనే ఉన్నారు.