: వృద్ధులకు చూపును ప్రసాదించే టెలిస్కోప్!
దూరంగా వున్న వస్తువులను పెద్దవిగా చూడడానికి టెలిస్కోప్ వాడుతుంటాం. అయితే, సూక్ష్మ టెలిస్కోప్ అనే పరికరాన్ని కంట్లో అమర్చితే దృష్టి మెరుగుపరచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే 'ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్' (ఏఎండీ) అనే కంటి జబ్బు చాలా బాధిస్తుంటుంది. ఈ వ్యాధి వల్ల రెటీనాలోని మధ్యభాగం దెబ్బతిని కంటిచూపు మందగిస్తుంది. ఇప్పటి వరకూ ఈ వ్యాధికి చికిత్స లేదు.
అయితే, కంటిలో సూక్ష్మ టెలిస్కోప్ ను అమర్చడం ద్వారా కంటిచూపును మెరుగుపరచడం సాధ్యమేనని అమెరికాకు చెందిన సిడ్ మాందేల్ బామ్ అనే ఆప్తాలమిస్ట్ (నేత్ర వైద్యుడు) చెబుతున్నాడు. న్యూయార్క్ నగరంలోని 'ఈస్ట్ సైడ్ ఐ సర్జన్స్' సంస్థకు చెందిన సిడ్ బృందం, ఈ సూక్ష్మ టెలిస్కోప్ ను ఈ వ్యాధితో బాధపడుతున్న వృద్ధుల కంట్లో విజయవంతంగా అమర్చారు. దీని వల్ల కంటి ఎదురుగా వున్న వస్తువు పెద్దదిగా కనపడుతుంది. తద్వారా వ్యాధి బాధ తప్పుతుంది. ఇలాంటి వృద్ధులకు నిజంగా ఇది వరప్రదాయని అనే చెప్పచ్చు!