: బరువు తగ్గాలంటే వీటికి దూరంగా ఉండండి
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే కొన్నింటికి దూరంగా ఉంటే చాలు. చాలామంది బరువు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా పళ్ల రసాలను తాగుతుంటారు. కానీ, ఇలా పళ్ల రసాలను తాగడం మంచిది కాదని పరిశోధకులు సూచిస్తున్నారు. రసాలు తాగడం వల్ల బరువు పెరుగుతారే గానీ తరుగుదల తక్కువేనని హెచ్చరిస్తున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లను మన రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇదే విషయాన్ని చాలామంది మనకు సూచిస్తుంటారు. అయితే కొందరు పళ్లను తినడానికి బద్దకించి వాటిని పిండి, జ్యూస్ రూపంలో తాగుతుంటారు. ఇలా పళ్ల రసాలకు, మామూలుగా మనకు షాపుల్లో లభించే సాఫ్ట్ డ్రింక్‌లకు పెద్ద తేడా లేదని, సాఫ్ట్ డ్రింక్‌ల వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో పళ్ల రసాల వల్ల కూడా ఇంచుమించు అంతే హాని కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
కేంబ్రిడ్జ్ వర్సిటీ డైట్ అండ్ ఒబెసిటీ పరిశోధన విభాగానికి అధిపతి సుసాన్ జెబ్ మాట్లాడుతూ, బరువు తగ్గాలనుకునేవారు పళ్ల రసాలకన్నా పళ్లు తినడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే మంచిదని సూచిస్తున్నారు. సాధారణ సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉన్నంత చక్కెర పళ్ల రసాల్లో కూడా ఉంటుందని, దీనివల్ల స్థూలకాయం తప్పదని సుసాన్ హెచ్చరిస్తున్నారు. రసం రూపంలో కాకుండా పండును అలాగే తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిదని, అలాగే నిల్వ ఉన్న పళ్ల రసాలతో కూడా స్థూలకాయం వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. బత్తాయి పళ్లను ఒకటి లేదా రెండు తింటే కడుపు నిండిన భావన కలుగుతుందని, అలాకాకుండా ఓ ఆరేడు పండ్లను రసం పిండి తాగినా కూడా కడుపు నిండిన భావన కలగదని సుసాన్ చెబుతున్నారు. కాబట్టి పండ్లను అలాగే తినడం అలవాటు చేసుకోండి.