: ఒక్కరోజులోనే ఇల్లు కట్టేయవచ్చు!


ఇల్లు కట్టడానికి ఎంత సమయం పడుతుంది... అంటే దీనికి చాలా రకాలుగా సమాధానాలు వస్తాయి. కొందరికి ఓ ఐదారు నెలలు పట్టవచ్చు. మరికొందరికి ఏడాది పట్టవచ్చు. సమయానికి డబ్బు అందక మరికొందరికి ఇంకా లేటు కూడా కావచ్చు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం తమకు కేవలం ఇరవై నాలుగు గంటలు చాలు... చకచకా ఇల్లు కట్టేస్తాం అంటున్నారు. ఎలాగంటే జస్ట్‌ మీకు కావాల్సిన ఇల్లు బొమ్మను కంప్యూటర్‌పై చూపించి ఇస్తే చాలు... చకచకా ప్రింటు తీసి ఇల్లు కట్టేస్తాం అంటున్నారు.

ఇప్పుడు చాలావరకూ మనిషికి అవసరమైన అవయవాలను త్రీడీ ప్రింటు తీసి ఉపయోగిస్తున్నారు. ఇదే తరహాలో చిన్న చిన్న బొమ్మలు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను కూడా ముద్రిస్తున్నారు. చివరికి తుపాకులను కూడా త్రీడీ ప్రింటర్‌ ద్వారా ముద్రించి తయారుచేశారు. అంతటితో ఆగకుండా భారీ త్రీడీ ప్రింటర్‌ను తయారుచేసిన శాస్త్రవేత్తలు దీనితో ఇల్లు కట్టేయవచ్చని చెబుతున్నారు. విశాలమైన ఇంటిని కేవలం ఒక్కరోజులోనే నిర్మించే భారీ త్రీడీ కాంక్రీట్‌ ముద్రణా యంత్రాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని సాయంతో 2,400 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్కరోజులోనే కట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ యంత్రాన్ని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ బెహ్రాక్‌ ఖోష్నెవిస్‌ రూపొందించారు. ఈ యంత్రానికి ఆధారంగా ఉండే పొడవైన ఇనుప నిర్మాణం చివర్లో ఉండే పైపులు కంప్యూటర్‌లో ముందే తయారుచేసిన డిజైన్‌ ప్రకారం కాంక్రీట్‌ను వేస్తూ దశలవారీగా ఇల్లు కట్టేస్తాయట. కాంటూర్‌ క్రాఫ్టింగ్‌ విధానంలో ఈ యంత్రం చక్కగా లోపల గదుల సహా మొత్తం ఇంటిని కట్టేస్తుంది. తక్కువ ఖర్చు, దీన్ని కట్టడానికి పట్టే సమయం కూడా తక్కువే. ఈ యంత్రం భూమిపైన కాకుండా అంతరిక్షంలోని ఇతర గ్రహాలపై ఆవాసాలు ఏర్పాటు చేయాలని తలచే శాస్త్రవేత్తలకు చక్కగా ఉపయోగపడుతుందని బెహ్రాక్‌ చెబుతున్నారు. మొత్తానికి ప్రింటింగ్‌ ఇళ్లు వచ్చేస్తున్నాయి. ఏమాత్రం గట్టిగా ఉంటాయో తెలియదు మరి!

  • Loading...

More Telugu News