: మోడీ..త్రీడీ.. ఓ గిన్నిస్ రికార్డు!
కొందరు ప్రసంగిస్తే నరాలు తెంపుకోవాలన్న ఉన్మత్తత ఏర్పడుతుంది! . మరికొందరు మాట్లాడితే అణువణువు ఉత్తేజంతో ప్రజ్వరిల్లుతుంది.. తనువంతా కొత్త శక్తితో ఉప్పొంగుతుంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నిస్సందేహంగా రెండో కోవకు చెందుతారు.
కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని తన వాగ్దాటితో తిప్పికొట్టి గుజరాత్ లో మళ్లీ బీజేపీని పీఠంపై కూర్చుండబెట్టడంతో, మోడీ వాక్పటిమ లోక ప్రాచుర్యం పొందింది. ఇప్పుడది గిన్నిస్ రికార్డులకూ ఎక్కింది. ఎలాగంటారా, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థులందరూ మోడీ మాటల మహిమపైనే ఆశలు పెట్టుకున్నారట.
మోడీ ఒక్కడు ఎన్ని నియోజకవర్గాలని తిరగ్గలడు?.. వెంటనే వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు మోడీ. ఎన్ చాంట్ త్రీడీ అనే సంస్థకు తన ప్రసంగాన్ని ప్రసారం చేసే బాధ్యత అప్పగించారు. ఎన్ చాంట్.. గత ఏడాది డిసెంబర్ 10న మోడీ ప్రసంగాన్ని త్రీడీ విధానంలో గుజరాత్ లోని 53 ప్రదేశాల్లో ఏకకాలంలో ప్రసారం చేసింది.
దీంతో, ప్రత్యర్థులు డంగై పోవడం, బీజేపీ అభ్యర్థుల్లో అత్యధికులు ప్రజల్లోకి చొచ్చుకుని పోగలిగారట. ఈ నూతన సాంకేతికతను ఉపయోగించుకుని ప్రపంచంలో మరెవ్వరూ ప్రసంగించలేదని భావించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు వారు వెంటనే మోడీ అండ్ కోను తమ రికార్డు పుటలకెక్కించారు.