: మలేరియా గుట్టు రట్టు
మలేరియా కారక క్రిమి మానవుడిపై ఎలా దాడి చేస్తుంది? అనే విషయంలో శాస్త్రవేత్తలకు పూర్తి అవగాహన లేకుండా ఉండేది. ఇప్పుడు ఆ క్రిమి మానవుడిపై ఎలా దాడి చేస్తుంది? అనే విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టంగా తెలుసుకున్నారు. దీంతో మలేరియా వ్యాధికి సరికొత్త చికిత్సను రూపొందించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనదేశంలోను, ఆగ్నేయాసియాలోనూ ఎక్కువగా కనిపించే మలేరియా కారక ప్లాస్మోడియం వివాక్స్ మానవుల ఎర్ర రక్తకణాలపై ఎలా దాడి చేస్తుంది? అనే విషయాన్ని భారత సంతతికి చెందిన నీరజ్ తోలియా అనే శాస్త్రవేత్త కనుగొన్నారు.
ఈ విషయం గురించి నీరజ్ మాట్లాడుతూ, ఈ క్రిమి ఒక ప్రొటీన్‌ను మానవుల్లోని ఎర్ర రక్తకణాలకు గుచ్చడం ద్వారా అది వాటికి అతుక్కుంటుందని ఇంతకాలం భావిస్తూ వచ్చామని, అయితే ఇది ఒక జత ప్రొటీన్లను మానవుల్లోని ఎర్ర రక్తకణాలకు గుచ్చడం ద్వారా ఈ క్రిమి దాడి చేస్తుందని స్పష్టమయ్యిందని తెలిపారు. తాము కనుగొన్న విషయం మలేరియా వ్యాధికి సమర్ధవంతమైన వాక్సిన్ రూపకల్పనకు దోహదపడుతుందని నీరజ్ చెబుతున్నారు.