: దిగ్గజాన్ని ఢీకొనడానికి సిద్ధమవుతున్న నిలేకని
ఆధార్ ప్రాజెక్టు చైర్మన్, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో నందన్ నిలేకని రాజకీయ ఆరంగేట్రం దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటున్నారు. టికెట్ కోసం ఇప్పటికే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కూడా వ్యక్తిగతంగా కలుసుకున్నారు.
అయితే, బెంగళూరు సౌత్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది. 1996 నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి అనంతకుమార్ ఈ నియోజకవర్గం నుంచి ఓటమి అన్నది ఎరుగకుండా వరుసగా గెలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఒక వేళ నిలేకని ఎన్నికల్లో పోటీ చేసినా, ఆయన గెలుపు ఎంత మాత్రం అనేది ప్రశ్నార్థకమే. అయితే అత్యంత చైతన్యవంతులైన బెంగళూరు ఓటర్లు తనకు పట్టం కడతారనే ధీమాతో నిలేకని ఉన్నారు.