: అవినీతిపై 4 వేల ఫోన్ కాల్స్ వచ్చాయి: కేజ్రీవాల్
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చేద్దామంటూ తానిచ్చిన పిలుపుకు ఢిల్లీ వాసులు బాగా స్పందించారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తామిచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ కు అవినీతికి పాల్పడుతున్న వారిపై నేటి ఉదయం నుంచి మధ్యాహ్నానికి నాలుగు వేల కాల్స్ చేశారని అన్నారు. అందులో 38 మందిపై తీవ్ర అభియోగాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నవారిపై విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీని అవినీతి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.