: జగనే అసలు సిసలు విభజనవాది: అసెంబ్లీలో పల్లె రఘునాథ్
ఆనాడు వైయస్ నాటిన విషబీజమే నేడు మహా వృక్షమైందని టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సమైక్య ముసుగులో ఉన్న అసలుసిసలు విభజనవాది జగనేనని మండిపడ్డారు. ఓ పధ్ధతి ప్రకారం వైఎస్సార్సీపీ సమైక్యాంధ్రకు తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. పరకాలలో తెలంగాణకు అనుకూలమని విజయమ్మ చెప్పలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని ఇడుపులపాయలో జగన్ చెప్పలేదా? అంటూ నిలదీశారు. సీమాంధ్ర ప్రజల గొంతు కోసి విభజనకోసం ముందుకెళ్తున్నారని వాపోయారు.
బిల్లుపై ఓటింగ్ జరగాల్సిందేనని పల్లె డిమాండ్ చేశారు. రాష్ట్రాలు తీర్మానాలు చేసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పాసైనా ఇంత వరకు విభజన చేపట్టలేదని... ఇక్కడ మాత్రం బలవంతంగా ఎందుకు విభజించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎంతో ఆవేదనతో ఈ చర్చలో పాల్గొంటున్నానని చెప్పారు. నాగం గతంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడిన విషయాన్ని మరచిపోరాదని అన్నారు. ఆర్టికల్ 3ను ఇష్టానుసారం వాడుకోవాలనుకోవడం సరైంది కాదని తెలిపారు.