: భోజనం మీ ఇంట్లో... పార్టీ మా ఇంట్లో!
ఒక సినిమా పాటలో 'వచ్చేటప్పుడు ఏం తెస్తారు... వెళ్లేటప్పుడు ఏమిస్తారు' అంటూ పాడతారు. అలాగా పార్టీకి ఆహ్వానిస్తూ... 'భోజనాలు గట్రా మీ ఇంట్లో... విందు రహిత పార్టీ, డ్యాన్సులు గట్రా మా ఇంట్లో'... అంటూ ఆహ్వానం పంపేవారుంటారా...! ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొందరు పిసినారులు ఉంటే అలాంటి ఆహ్వానాలను మనం అందుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక దేశాధ్యక్షుడి భార్య ఇలాంటి ఆహ్వానం పంపితే ఏమనాలి... అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా మాత్రం ఇలాంటి ఆహ్వానమే పంపుతున్నారు.
'మీ ఇంట్లో కడుపునిండా భోజనాలు చేసివచ్చి... మా ఇంట్లో పార్టీకి హాజరై చక్కగా మమ్మల్ని ఆశీర్వదించండి' అన్న ఆహ్వానం తీసుకున్న అతిధులు మాత్రం ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. మిషెల్లీ తన యాభయ్యవ పుట్టినరోజు వేడుకలకు అతిధులకు ఇలాంటి ఆహ్వానాన్ని పంపారట.
ఈ నెల 18న తన పుట్టినరోజు వేడుకలకు రాబోవు అతిధులంతా చక్కగా వారి వారి ఇండ్లలోనే కడుపారా భోజనాలు చేసిరావాలని, పార్టీలో ఎలాంటి విందులు ఏర్పాటు చేయడం లేదని ఆహ్వానంలో స్పష్టం చేశారట. అంతేకాదు... భోజనాలకోసం, అతిధులకోసం గడుపుతూ సమయాన్ని వృధా చేయడం తమకు ఇష్టం లేదని ముక్తాయింపునిస్తూ... అతిధులు వచ్చేముందు కాస్త డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుని వస్తే పార్టీలో కాసేపు చిందేయవచ్చని కూడా చెబుతున్నారట. మొత్తానికి చిందేయడానికైనా కాస్త సమయాన్ని కేటాయించుకున్నారు... ఇలాంటి ఆహ్వానం తీసుకున్న అతిధులు మరి ఎలా రియాక్ట్ అవుతారో!!