: కాకతీయ యూనివర్శిటీలో దయ్యాల సంచారం?
వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం రాత్రి అయితే బిక్కుబిక్కుమంటోంది. ముఖ్యంగా యూనివర్శిటీలో చదువుకుంటున్న మహిళలు హడలిపోతున్నారు. కారణం ఏంటంటే... మహిళల వసతి గృహాలున్న ప్రాంతంలో రాత్రి పూట అక్కడ దయ్యాలు సంచరిస్తున్నాయట... అవి శబ్దాలు కూడా చేస్తున్నాయట! దీంతో చీకటి పడకముందే అమ్మాయిలందరూ హాస్టల్ కు చేరుకుంటున్నారు. రాత్రి పూట బయటకు రావడం కూడా మానేశారు.
అయితే దయ్యాలను చూసిన వారు కానీ, వాటి శబ్దాలను ప్రత్యక్షంగా విన్న వారు కానీ ఎవరైనా ఉన్నారా అంటే... ఎవరూ లేరనే సమాధానమే వస్తోంది. ఎవరో పనిగట్టుకునే ఈ పుకార్లను లేపుతున్నారని యూనివర్శిటీ విద్యార్థి నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై యూనివర్శిటీ యాజమాన్యం కూడా స్పందించింది. పుకార్లకు కారణమైన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.