: వయసు చిన్నదే... మెదడు పెద్దది!
పరిశోధన చేయడానికి వయసుతో పనిలేదు. అలాగే చక్కటి ఆరోగ్యం గురించి చెప్పడానికి కూడా వయసు అవసరం లేదు. అందుకే పదవ తరగతి చదువుతున్న ఒక బాలిక చక్కటి ఆరోగ్యకరమైన పానీయాన్ని తయారుచేసి అందరిచేత శభాష్ అనిపించుకోవడమేకాదు... చక్కటి పురస్కారాన్ని కూడా పొందింది. పశ్చిమబెంగాల్లోని పురులియా జిల్లాకు చెందిన పదిహేనేళ్ల దేవాద్రిత మండల్ అనే బాలిక తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన పానీయాన్ని తయారుచేసి, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ వారి సృజనాత్మక పురస్కారానికి ఎంపికయ్యింది. దేవాద్రిత బొంగాబరి బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఈమె తక్కువ ఖర్చుతోనే హోంలిక్స్ అనే ఆరోగ్యకరమైన పానీయాన్ని తయారుచేసి, అందరి ప్రశంసలను పొందింది. రెండేళ్ల క్రితం ఒక పేదమహిళ తన బిడ్డను పౌష్టికాహార లోపం నుండి కాపాడడానికి ఏం చేయాలని దేవాద్రితను అడిగిందట. దీంతో తక్కువ ధరకు ఆరోగ్యకరమైన పానీయాన్ని తయారుచేయాలని ఆలోచన తనలో కలిగిందట. దీంతో గోధుమలు, పాలపొడి, పంచదార, సోయాబీన్ వంటి పదార్ధాలతో దేవాద్రిత హోంలిక్స్ పానీయాన్ని తయారుచేసింది. ఇది మంచి బలవర్ధకమైనది కావడంతోబాటు దీన్ని తయారుచేయడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువ కావడంతో అందరూ దేవాద్రితను మెచ్చుకుంటున్నారు.