: త్వరలో రేడియోల్లోనూ వార్తల సందడి
24 గంటల వార్తా టీవీ చానళ్ల రణగొణ ధ్వనులతో విసిగిపోయారా..? పర్లేదు, త్వరలో టీవీలు కట్టేసి ఎంచక్కా రేడియోల్లో వార్తలు విందురులేండి. వాణిజ్య, కమ్యూనిటీ రేడియోల్లో వార్తా ప్రసారాలను అనుమతించే విషయమై కేంద్ర సమాచార, ప్రసార శాఖ.. న్యాయ, రక్షణ శాఖల అభిప్రాయాలు కోరింది. భద్రతా కోణంలో అభ్యంతరాలు చెప్పకుంటే వార్తల ప్రసారానికి అడ్డంకులు తొలగినట్లే. ప్రైవేటు రేడియోల్లో వార్తల ప్రసారాన్ని ఎందుకు అనుమతించరంటూ ఒక స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టులో ఇటీవల ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడంతో.. దీనిపై పునరాలోచించాలని కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో సమాచార, ప్రసార శాఖ కసరత్తు ప్రారంభించింది.