: పిండకుండా తింటే పండు ఫ్రెండేకదా...
పళ్ల రసాలు తాగేవారికి ఓ సూచన! పండ్లను పిండి రసం తాగేకన్నా అలాగే తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పండ్లను అలాగే తినడం వల్ల వాటిలోని పీచు మన ఆరోగ్యానికి చాలా ఉపకరిస్తుందని, అలాకాకుండా రసం పిండి తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు చాలామంది పండ్లను తినడం వైపు ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే పండ్లను అలాగే తినడానికి బద్దకించి, వాటి రసాన్ని పిండి తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ పండ్లను చక్కగా కడుక్కొని అలాగే తింటేనే మంచిదని, రసం పిండి తాగడం వల్ల అది ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చాలామంది షుగరు వ్యాధిగ్రస్తులు పండ్లను తినడానికి దూరంగా ఉంటారు. వాటిని తినడం వల్ల ఎక్కడ షుగరు పెరిగిపోతుందేమోనని భయంతో పండ్లను తినకుండా ఉంటారు.
కానీ ద్రాక్ష, యాపిల్ వంటి పండ్లను నేరుగా తినడం వల్ల షుగరు వ్యాధి సోకే ప్రమాదం తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో, ఈ పండ్లను నేరుగా తినకుండా రసం తాగడం వల్ల షుగరు వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పండ్లను నేరుగా తినడం వల్ల టైప్`2 మధుమేహం రాదని వాషింగ్టన్‌లో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో పరిశోధకులు పీచ్, స్ట్రాబెరీ, నారింజ, ప్లమ్, కిస్‌మిస్ వంటి అనేక రకాల పండ్లపై పరిశోధనలు చేశారు. ఈ పండ్లను పిండకుండా అలాగే తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ పరిశోధనల్లో తేలింది. కాబట్టి పండ్లను పిండకుండా పండుగానే తినండి.