: మనలోనూ భారీకాయులున్నారట


స్థూలకాయం సమస్య ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో ఉండేది. కానీ, ఇప్పుడు అది క్రమేపీ మన దేశానికి కూడా వ్యాపిస్తోందట. ఇప్పటి వరకూ పాశ్చాత్య దేశాల్లో ఉండే వారి ఆహారపు అలవాట్లు, అక్కడి వాతావరణ పరిస్థితులు తదితర అంశాల కారణంగా అక్కడ ఊబకాయం సమస్య ఎక్కువగా ఉంటుంది అనుకునేవారు. కానీ, ఈ సమస్య ఇప్పుడు మనదేశానికి కూడా వ్యాపిస్తోందట. మన ప్రజల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా మనదేశంలో కూడా ఊబకాయం సమస్య పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.

లండన్‌కు చెందిన ఓవర్సీస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ అనే స్వతంత్ర మేథోసంస్థ తన ఫ్యూచర్‌ డైట్స్‌ నివేదికలో భారత్‌ వంటి మధ్యస్థాయి ఆదాయ దేశాలు కూడా స్థూలకాయులకు కేంద్రాలుగా మారుతున్నాయని పేర్కొంది. ఇప్పటి వరకూ ఊబకాయం అనేది ధనిక, పాశ్చాత్య దేశాల సమస్యగా భావిస్తున్న నేపథ్యంలో ఇది తప్పని ఈ నివేదిక పేర్కొంది. భారత్‌, చైనా, ఈజిప్టు, పెరూ, థాయ్‌ల్యాండ్‌ వంటి ఐదు మధ్య ఆదాయ దేశాలను ఎంపిక చేసుకుని ఈ సంస్థ పరిశీలించింది. అక్కడ గత యాభై ఏళ్లలో ప్రజల ఆహారపు అలవాట్లలో వచ్చిన ధోరణులను అధ్యయనం చేసింది.

1980 నుండి 2008 మధ్య అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఊబకాయుల సంఖ్య మూడురెట్లు పెరిగిందని ఈ సంస్థ తెలిపింది. మనదేశంలో 1980లో మొత్తం జనాభాలో 9శాతం మంది ఉన్న ఊబకాయుల సంఖ్య 2008 నాటికి 11 శాతానికి పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. భారత్‌లో జంతుసంబంధ ఆహార పదార్ధాల ఉత్పత్తుల వినియోగం కూడా పెరిగిందని, ఆదాయాల పెరుగుదల, చౌక పదార్ధాలు వంటివి ఆహారపు అలవాట్లలో మార్పులకు దారితీస్తున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. ఇలా ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా బరువు పెరగడం, కొన్నిరకాల క్యాన్సర్లు, మధుమేహం, గుండెజబ్బులు, పక్షవాతం వంటి ముప్పులు కూడా పెరగడానికి కారణమవుతోందని ఈ అధ్యయనవేత్తల్లో ఒకరైన స్టీవ్‌ విగిన్స్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News