: ‘కోరుకున్న ప్రియుడే’ కడతేర్చాడు..
గ్రేటర్ హైదరాబాదులో జరిగిన అబల హత్యోదంతంలో ప్రియుడే నిందితుడు కావడం మానవత్వానికే మచ్చ తెచ్చింది. హయత్ నగర్ మండలం బాటసింగారంలో వారం రోజుల క్రితం జరిగిన యువతి హత్య కేసు మిస్టరీ వీడింది. మరో యువకుడితో చనువుగా ఉండటం భరించలేని ప్రియుడే ఆమెను హతమార్చినట్టు పోలీసు విచారణలో తేలింది. నిందితుడితో పాటు హత్యకు సహకరించిన మరో వ్యక్తిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురం ఏసీపీ ఆనంద్ భాస్కర్ హత్య కేసు వివరాలను మీడియాకు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇమామ్ సాబ్ కూతురు షబానాబేగం (20) రాంకోఠిలోని ఓ ఇంట్లో పనిచేస్తోంది. కాచిగూడలో పనిచేసే మహ్మద్ హుస్సేన్ (23)తో పరిచయం కాలక్రమంలో ప్రేమగా మారింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే, మరో యువకుడితో షబానా చనువుగా మెలగడంతో సహించలేని హుస్సేన్ ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆటో డ్రైవర్ అయిన తన అన్న కొడుకుతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు.
షబానాను రామోజీ ఫిల్మ్ సిటీ చూపిస్తామని నమ్మించి ఆటోలో బాటసింగారం దేశ్ ముఖి రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆటో చెడిపోయిందంటూ ఆపి.. ఆమెపై కత్తి, స్క్రూడ్రైవర్ తో దాడి చేశాడు. కింద పడిపోయాక తలపై బండరాయితో మోది చంపేశాడు. తర్వాత మెల్లగా ఇంటికెళ్లిపోయారు. సోమవారం మృత దేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హతురాలి సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆమె ప్రియుడే నిందితుడని తేలడంతో హుస్సేన్ ను, అతనికి సహకరించిన ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. ఆటోను (ఏపీ12వీ8358) సీజ్ చేశారు.