: గణితంతో ఏజింగ్ కంట్రోల్!
లెక్కలు కొందరిని జీవితంలో చాలా ఇక్కట్లకు గురిచేస్తాయి. చాలామంది లెక్కలు అంటే భయపడతారు. అయితే అదే లెక్కలతో వయసును కంట్రోల్ చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఇలా వయసును కంట్రోల్ చేయడం ఎలాగో... అని మీకు సందేహంగా ఉందా? అయితే, మీరు కచ్చితంగా ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే.
టెల్‌అవీన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం కంప్యూటర్ అల్గారిథమ్‌ను (క్రమసూత్ర పద్ధతిని) రూపొందించారు. ఈ పద్ధతిద్వారా వయసు పెరుగుదలను ప్రభావితం చేసే జన్యువులను గుర్తించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పద్ధతి ద్వారా జీవితకాలాన్ని ముఖ్యంగా యవ్వనదశను మరింతగా పెంచడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కెరెన్ యిజ్జక్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఈ గణితసూత్రంతో వయసు పెరుగుదలను నిరోధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరుగుదలను నిరోధించడానికి ప్రస్తుతం వినియోగంలో ఉన్న అల్గారిథమ్‌లు బ్యాక్టీరియా సోకిన కణాలను గుర్తించి, ఔషధం ఆ కణాలపై దాడిచేయడంలో ఉపయోగపడుతున్నాయని, కానీ తాము తయారుచేసిన అల్గారిథమ్ మాత్రం వ్యాధిగ్రస్థ కణాలను ఆరోగ్యవంతంగా మార్చడానికి ఔషధాలను ప్రయోగించడంలో సహకరిస్తుందని కెరెన్ చెబుతున్నారు.
ఈ కొత్త అల్గారిథమ్‌ను ఈస్ట్ శిలీంధ్రంలో పరీక్షించి చూడగా, వయసు పెరుగుదలను జీఆర్‌ఈ3, ఏడీహెచ్2 అనే రెండు జన్యువులు ప్రభావితం చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాటి పనితీరును అడ్డుకోవడం ద్వారా పరిశోధకులు ఈస్ట్ జీవితకాలాన్ని పెంచగలిగారు. జన్యువులను అడ్డుకున్నప్పుడు ఈస్ట్‌లో ఆక్సీడేటివ్ ఒత్తిడి స్థాయి పెరిగిందని, వయసు పెరుగుదలను అరికట్టడానికి సాధారణంగా అనుసరించే క్యాలరీలను తగ్గించే ప్రక్రియలతో కూడా ఇటువంటి ఫలితాలే సంభవిస్తాయని కెరెన్ తెలిపారు. శాస్త్రవేత్తలు దీనిపై ప్రస్తుతం మరింత లోతైన పరిశోధనలు జరుపుతున్నారు.