: ఇలాంటి దొంగతనం, వ్యాపారం కూడా చేస్తారా...!!
దొంగతనం అంటే ఏదో డబ్బు, దస్కం దొంగిలించడం, లేదా టి.వి.లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు దొంగిలించడం గురించి మనం వినివుంటాం. కానీ మెదడును దొంగిలించే దొంగను గురించి వినివుండం. అలా మెదడులను దొంగిలించడమే కాకుండా, దొంగిలించిన మెదడులను ఆన్‌లైన్‌లో బేరం పెట్టి మరీ అమ్మడం చేస్తున్న ఒక దొంగను ఎట్టకేలకు పోలీసు బాబాయిలు పట్టేసుకున్నారు.
ఇండియానా చారిత్రక వైద్య పురావస్తుశాలలో 1890లో చనిపోయిన వారి మెదళ్లను, మెదడు కణజాలాన్ని జాడీలలో భద్రపరిచివుంచారు. రోగులు, మానసిక వ్యాధిగ్రస్తుల మృతదేహాలకు శవపంచనామా జరిపిన తర్వాత వాటిని అక్కడ భద్రపరుస్తారు. ఈ జాడీలలో సుమారు అరవైకి పైగా జాడీలను అక్టోబరులో డేవిడ్ చార్లెస్ అనే ఒక ప్రబుద్ధుడు దొంగిలించాడు. అంతటితో ఆగకుండా ఆ జాడీలను ఆన్‌లైన్ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టాడు. చార్లెస్‌నుండి ఆరు జాడీలను ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు.
సదరు కొనుగోలు చేసిన వ్యక్తి తాను కొన్న జాడీలు మ్యూజియం నుండి దొంగిలించబడినవిగా మ్యూజియం వెబ్‌సైట్‌లో ఉన్న జాడీలతో పోల్చిచూసి, ఒకేలా ఉండడంతో అనుమానం వచ్చి ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు విచారించి చార్లెస్‌ను డిసెంబరు 16న అరెస్టుచేశారు. ప్రస్తుతం ఇండియానా పోలీస్ కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. అయినా మెదళ్లను కూడా దొంగిలించవచ్చని చార్లెస్‌కు ఎలా అనిపించిందో... వాటితో వ్యాపారం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో...!!