: పొగ తాగుతున్నారా... అయితే ఇక నిద్ర హుళక్కే!
పొగతాగుతున్నారా? అయితే ఒక్కసారి ఇది చదవండి. పొగతాగే అలవాటు ఉన్నవారికి క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదమే కాదండోయ్, నిద్రకూడా సరిగ్గా పట్టదని... ఇటీవల న్యూయార్క్ లోని రోచెస్టర్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ, వైద్య విభాగంలో పని చేస్తున్న సైంటిస్ట్ ఇర్ఫాన్ రెహ్మాన్ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే మాత్రం పొగతాగడం మానేయాలని ఆయన హెచ్చరిస్తున్నారు.
పొగతాగే వారిపై దాని ప్రభావం ఊపిరితిత్తులతో పాటు మెదడుపై కూడా పడుతుందని, దాని వల్ల నిద్రలేమి తలెత్తుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇంతకు ముందు పరిశోధనల్లో నిద్రలేమి అర్ధాయుష్షుకు కారణమని రుజువైన సంగతి తెలిసిందే. అందుకే పొగరాయుళ్లూ తస్మాత్ జాగ్రత్త... నిద్రలేమేకాదు అల్పాయుష్షుకు కూడా పొగే కారణం.