: మీ ముంగిటకు పోస్టల్ బ్యాంక్?


మీ వీధిలో ఉన్న పోస్టాఫీసే బ్యాంకుగా మారబోతోంది. బ్యాంకు కోసం ఎక్కడికో వెళ్లే అవసరం లేకుండానే సులువుగా పనులు పూర్తి చేసుకునే సౌలభ్యం త్వరలోనే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

చాలా ఏళ్ల తర్వాత కొత్త బ్యాంకుల లైసెన్స్ ల కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) ద్వారాలు తెరిచింది. రిలయన్స్, బిర్లా, ఎల్ఐసీ ఇలా అగ్రగామి కంపెనీలన్నీ బ్యాంకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించడానికి రెడీగా ఉన్నాయి. ఇదే కోవలో పోస్టల్ శాఖ కూడా బ్యాంకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తోంది. 

భారతీయ పోస్టల్ విభాగం ప్రపంచలోనే అతిపెద్దదిగా పేరు తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా లక్షా యాభై ఐదు వేల పోస్టల్ శాఖలున్నాయి. ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు 5.5 లక్షల కోట్ల వరకూ ఉన్నాయి. బ్యాలెన్స్ షీటు 6.18 లక్షల కోట్లుగా ఉంది. దీంతో బ్యాంకు ప్రారంభించడానికి పోస్టల్ శాఖకు పూర్తి అర్హతలు ఉన్నట్లే. అయితే ప్రతిపాదిత పోస్టల్ బ్యాంకు సాధారణ కార్యకలాపాలతో కలిసి కాకుండా వేరుగా ఉంటుంది. ఇది 500 కోట్ల రూపాయల మూలధనంతో సేవలు ప్రారంభించే అవకాశాలున్నాయని పోస్టల్ వర్గాల సమాచారం. 

ఈ ప్రతిపాదిత బ్యాంకు విషయంలో సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించే బాధ్యతలను పోస్టల్ శాఖ ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థకు అప్పగించింది. ఇది ఇచ్చే నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపిస్తారని సమాచారం. దీనిపై కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మాట్లాడుతూ.. "పోస్టల్ బ్యాంకుతో గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం ఉంటుంది. దేశవ్యాప్తంగా 1.55లక్షల పోస్టల్ శాఖలున్నాయి. దీనిలో సేవింగ్స్ బ్యాంకు సదుపాయాలను అందిస్తాం. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నాం" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News