: కేజ్రీవాల్ పై దేశద్రోహం కేసు ఉపసంహరణ
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఓ న్యాయ విద్యార్థి గతంలో పెట్టిన దేశద్రోహం కేసును ఉపసంహరించుకున్నాడు. ఏఏపీ అధినేత పనితీరును చూశాక ఆ కేసును తాను వెనక్కి తీసుకుంటున్నానని అతడు చెప్పాడు. 2012 సంవత్సరంలో ఘజియాబాద్ లో జరిగిన ఒక సభలో ప్రసంగించిన కేజ్రీవాల్ ప్రజా ప్రతినిధులను ‘హంతకులు, రేపిస్టులు, బందిపోటు దొంగలు’గా వ్యాఖ్యానించారని పేర్కొంటూ... అప్పట్లో ఓ న్యాయ విద్యార్థి ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరైన న్యాయ విద్యార్థి ‘కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆయన చాలా కష్టపడుతున్నారు’ అని తెలిపాడు. ఫిర్యాదుదారు వ్యాఖ్యలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి కేసు ఉపసంహరించుకోవడానికి అనుమతించారు.