: పొగకు 'పన్ను' పొగపెడితేనే...
ధూమపానం వల్ల పలు సమస్యలు వస్తాయని చెబుతున్నా పొగరాయుళ్లు...గుప్పు గుప్పుమంటూ రైలింజనులా పొగవదలడం మాత్రం మానరు. ఇలాంటి వారి ప్రాణాలను కాపాడాలంటే... ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలను తీసుకుంటే అప్పుడు కచ్చితంగా పొగరాయుళ్లు పొగతాగడం మానుతారని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకూ అలాంటి చర్యలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమంటే... పొగాకుపై పన్నును పెంపుచేయడం. పొగాకుకు పన్ను పొగ పెట్టడం ద్వారా పొగతాగడాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
టొరంటో, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలకి చెందిన పరిశోధకులు పొగాకుపై అధిక పన్నును విధించడం ద్వారా ఈ శతాబ్దిలో సంభవించే సుమారు ఇరవై కోట్ల ముందస్తు మరణాలను నివారించే వీలుందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ పొగాకుపై ఉన్న పన్నును మూడురెట్లు పెంచడం ద్వారా కొన్ని దేశాల్లో సిగరెట్ల అమ్మకాల ధరలు పెరుగుతాయని, అలాగే చౌక, ఖరీదైన సిగరెట్ల మధ్య తేడాలు కూడా తగ్గి, చౌకరకమైన సిగరెట్లు కూడా ధరలు పెరుగుతాయని, దీనివల్ల ధరలు పెరగగానే ఖరీదైనవి వదిలి చౌకరకం సిగరెట్లు తాగడానికి బదులు అసలు పూర్తిగా పొగతాగడం మానేస్తారని పరిశోధకులు వివరించారు.
ప్రస్తుతం చౌకరకం సిగరెట్లు తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటిని ఎక్కువగా వాడే అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో ఇలా పొగాకు పన్నును పెంచడం అనేది మంచి ఫలితాలను ఇస్తుందని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ప్రభాత్ చెబుతున్నారు. అలాగే ధనిక దేశాల్లో కూడా ఈ పన్ను ప్రభావం ఉంటుందని, పొగతాగడాన్ని తగ్గించేందుకు, భవిష్యత్తులో పొగతాగేవారిగా మారేవారిని అడ్డుకోవడానికి ఒకే ఒక మార్గం పొగాకు పన్నును పెంచడమేనని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పొగరాయుళ్ల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదముందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రొఫెసర్ సర్ రిచర్డ్ పెటో హెచ్చరిస్తున్నారు. పొగరాయుళ్లు పొగవల్ల తమ జీవితకాలంలో సగటున పదేళ్ల జీవితకాలాన్ని నష్టపోతున్నారని పెటో వివరించారు.