: అవినీతిపై పోరాటం చేసేవాళ్లంతా మాతో కలసి నడుస్తున్నారు: కేజ్రీవాల్


తాము రాజకీయ పార్టీ పెడతామని, పోటీ చేస్తామని, విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కలలో కూడా అనుకోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. విశ్వాస పరీక్ష సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తమతో కలిసి అవినీతిపై పోరాటం చేసే వారంతా నడుస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వ పరిధిలో అవినీతికి పాల్పడే ఏ ఒక్కరినీ క్షమించమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయి. అందుకే ఎప్పుడు చూసినా రోడ్లును తవ్వి మళ్లీ బాగు చేస్తుంటుంది. కానీ ప్రజల రక్షణకు వచ్చే సరికి మాత్రం నిధులు లేవనే సమాధానం వినిపిస్తుందని, ఇకపై తాము అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు.

దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టాయని తాను కూడా అంగీకరిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే తాను సూచిస్తున్నానని ఆయన తెలిపారు. విద్యుత్ సంస్థల రిపోర్టు వచ్చిన తరువాత ఆ నివేదికను ప్రజల ముందు పెడతామని ఆయన తెలిపారు. ఆ తరువాత ప్రజలు నిర్ణయించిన రేటునే తాము నిర్ణయిస్తామని అన్నారు. నీటి విషయంలో రెండు ఆరోపణలు ఉన్నాయన్న కేజ్రీవాల్, నీటి బిల్లు చాలా ఎక్కువ వస్తోందని ఆరోపిస్తున్నారని, అది నిజమేనని అన్నారు.

రెండోది నీరు సరిపోవడం లేదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. దీని పరిష్కారంగా ప్రతి ఒక్కరూ నీటి మీటర్ వేయించుకోండి. అక్కడ నీరు వస్తోందో, అసలు వస్తుందో రాదో, ఎంత వస్తోందో తాము లెక్కలతో సహా వెబ్ సైట్లో పెడతామని ఆయన స్పష్టం చేశారు. విస్తరణల్లో, విపత్తుల్లో ప్రజలు ఇళ్ళు కోల్పోతున్నారని, దానికి పరిష్కారం వెతకాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News