: ముఖ్యమంత్రిగా నాదే తుది నిర్ణయం: సీఎం కిరణ్
పరిపాలనా సౌలభ్యం కోసమే శాఖల మార్పు చేశామని ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో ఆదాయం 9.5 శాతం తగ్గిందని... ఆదాయాన్ని పెంచుకునేందుకే శ్రీధర్ బాబుకు ఆ శాఖను కేటాయించామని తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై మఖ్యమంత్రిగా తనదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
ఈ నెల 24 లోపు టీబిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగడంపైనే దృష్టినంతా కేంద్రీకరించానని చెప్పారు. సభలో చర్చ జరిగితేనే... ఇరు ప్రాంతాల సమస్యలు తెలుస్తాయని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు బయట మాట్లాడటం, గొడవ చేయడం మానుకోవాలని... సభలోకి వచ్చి చర్చించి, అభిప్రాయాలను తెలియజేస్తే అన్నీ రికార్డవుతాయని చెప్పారు. తాను పార్టీ పెట్టే విషయంపై ఇంకా ఆలోచించలేదని కిరణ్ తెలిపారు. బాల్ ఎలా వస్తుందో చూసిన తర్వాతే బ్యాట్ ఊపాలని... ముందుగానే ఊపితే ఔట్ అవుతామని చెప్పారు.