: ఫుల్ జోష్ తో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన రాష్ట్ర ప్రజలు
రాష్ట్ర ప్రజలు ఫుల్ జోష్ తో 2014వ సంవత్సరానికి స్వాగతం పలికారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి గానాబజానాలతో ప్రధాన నగరాలు హోరెత్తాయి. హైదరాబాద్ లో యువత ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో బారులు తీరారు. నూతన సంవత్సరం ప్రవేశించగానే పెద్దపెట్టున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంలో మునిగిపోయారు.
విశాఖపట్టణంలో బీచ్ రోడ్ మొత్తం ఇసుకవేస్తే రాలని జనం పోగయ్యారు. పోలీసుల ఆంక్షలు తోసిరాజని యువతరం ఆలింగనాలు, అభినందనలు, శుభాకాంక్షలు, బాణాసంచా పేలుళ్లతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. నగర వ్యాప్తంగా బైక్ ర్యాలీలతో హోరెత్తించారు.
విజయవాడ బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్ లలో యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన యువత రోడ్డు ప్రమాదాల బారినపడి ఆసుపత్రుల పాలయ్యారు.