: సేవ్‌ చేయడం, సెల్లు ఛార్జింగ్‌ పెట్టడం అంతా పాతపద్ధతి!


కంప్యూటరుపై పనిచేస్తున్నప్పుడు ప్రతిసారీ మనం చేస్తున్న డాక్యుమెంటును సేవ్‌ చేయాల్సి ఉంటుంది. లేకుండా ఏదైనా అవాంతరం ఎదురైతే వెంటనే మనం అప్పటి వరకూ చేసిన పని ఒక్కసారిగా కనిపించకుండా పోతుంది. ఈ కారణంగా మనం చేస్తున్న పనిని ప్రతిసారీ సేవ్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే మన ఫోనుకు రోజూ ఛార్జింగ్‌ పెట్టుకోవాలి. లేదంటే బ్యాటరీ అయిపోయి చివరికి మనకు అవసరానికి మాట్లాడటానికి ఫోను ఉండదు. ఇకపై ఇలాంటి వాటికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మనం చేస్తున్న పని కంప్యూటరులో ఎప్పటికప్పుడు సేవ్‌ అయిపోతుంటుంది. అలాగే మన ఫోన్‌కు వారానికి ఒకసారి ఛార్జింగ్‌ చేసుకుంటే చాలు. ఎంరామ్‌తో ఇది సాధ్యమేనని పరిశోధకులు చెబుతున్నారు.

సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన పరిశోధకుల బృందం ఒక కొత్తరకం సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొంది. మ్యాగ్నటోరెసిస్టివ్‌ ర్యాండమ్‌ యాక్సెస్‌ మెమరీ (ఎంరామ్‌) అనే ఈ పరిజ్ఞానంతో కంప్యూటర్‌పై పనిచేస్తున్న ప్రతిసారీ సేవ్‌ చేయాల్సిన అవసరం లేదని, అలాగే రోజూ సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టాల్సిన అవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఎంరామ్‌ మెమరీ స్పేస్‌ను భారీగా పెంచుతుందని పరిశోధకుల బృందం చెబుతోంది. అంతేకాదు, ఉన్నట్టుండి కంప్యూటరు ఆగిపోయినా, లేదా కరెంటు లేకుండా ఆఫ్‌ అయిపోయినా అప్పటి వరకూ మనం చేసిన పని స్వయంచాలితంగా సేవ్‌ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్‌ ఫోన్లను కూడా రోజూ చార్జింగ్‌ చేయాల్సిన అవసరం ఉండదని, వారానికి ఒకరోజు చార్జింగ్‌ చేస్తే సరిపోతుందని వీరు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News