: భర్త వైద్యం కోసం మారథాన్ లో విజేతగా నిలిచిన 65 ఏళ్ల మహిళ!
రెక్కల కష్టాన్ని నమ్ముకునే శ్రమజీవికుండే ఆత్మస్థైర్యాన్ని ఏపాటిదో ఓ మహిళ ప్రదర్శించింది. తన భర్త వైద్యానికి 65 ఏళ్ల వయసులో సాహసం చేసి శభాష్ అనిపించుకుంది. మహారాష్ట్రలోని పూణే సమీపంలోని బారామతి దగ్గరలోని పింప్లీ గ్రామానికి చెందిన కూలీ లత భర్త హృద్రోగంతో బాధపడుతున్నాడు. వైద్యానికి 25 వేల రూపాయలు అవసరమయ్యాయి. వైద్య పరీక్షలకు చేతిలో చిల్లి గవ్వలేదు. భర్తకు వైద్యం చేయించాలి. అప్పటికే చేయించిన వైద్యానికి ఉన్న డబ్బులు కాస్తా అయిపోయాయి.
ఇప్పడు ఎమ్మారై స్కాన్ చేయించాలి. ఇప్పుడెలా? అనుకుంటున్న సమయంలో లతకు ఇరుగు పొరుగు ద్వారా మారథాన్ సంగతి తెలిసింది. విజేతకు 5 వేల రూపాయలు ఇస్తారని తెలుసుకుంది. ఇంట్లో చెప్పగా వారించడంతో టీ తాగి వస్తానని చెప్పి మారథాన్ లో పాల్గొని విజేతగా నిలిచిందీ 65 ఏళ్ల లత. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. అంతేకాదు, ఆమె భర్త వైద్య సాయానికి కూడా దాతలు ముందుకు రావడం విశేషం!