: రాష్ట్రంలో హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి: డీజీపీ
హైదరాబాదులో ఈరోజు 2013 క్రైమ్ రివ్యూ పై డీజీపీ ప్రసాదరావు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన నేరాలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తం 40 వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయని డీజీపీ ప్రసాదరావు చెప్పారు. సైబరాబాద్ పరిధిలో 3,335 రోడ్డు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై మొత్తం 123 కోట్లు వసూలు చేశామని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్, సైబరాబాద్, విశాఖలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని డీజీపీ తెలిపారు. సైబరాబాదు పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. హైదరాబాదులో భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, చిన్నారులపై హత్యలు ఎక్కువయ్యాయని డీజీపీ అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 2,231 హత్యలు జరిగాయని ఆయన చెప్పారు. ఎర్రచందనం స్మగర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 531 కేసులు నమోదు చేశామని, 3,249 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని, ఈ ఏడాది 163 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని, 79 మంది లొంగిపోయారని ఆయన చెప్పారు.